అమరావతికి మళ్లీ కళ

Jun 5,2024 00:59 #amaravathi, #jac
  • ఐదేళ్లుగా ముళ్ల తుప్పలతో నిండిన నగరం
  • ఆందోళన విరమణపై జెఎసి నిర్ణయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఐదేళ్లుగా ముళ్ల తుప్పలతో నిండిన రాజధాని అమరావతికి మళ్లీ కళ వచ్చింది. ఈ ప్రాంతాన్ని గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని పక్కనపెట్టింది. మాస్టర్‌ ప్లానులో మార్పులు చేర్పులు చేసింది. దీనిపై రైతులు ఐదేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అధికారంలోకి రావడంతో మరలా అమరావతి వ్యవహారాన్ని ముందుకు తీసుకురానున్నారు. 9న అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారంతో నడుస్తోంది. దీంతో తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, వెలగపూడితోపాటు అన్ని శిబిరాల్లోనూ రైతులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన శిబిరాల విరమణ చేయాలని నిర్ణయిచినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే తేదీ ప్రకటిస్తామని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. ఈ ఐదేళ్లలో రైతులపైనా పోలీసులు పెద్దయెత్తున కేసులు నమోదు చేశారు. అరెస్టులు చేశారు. కనీస ప్రదర్శనలకు అనుమతినివ్వకుండా వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై రైతులు కోర్టులను కూడా ఆశ్రయించారు. అలాగే సిఆర్‌డిఎ చేస్తున్న మాస్టర్‌ప్లాను మార్పులపైనా, మూడు రాజధానుల ప్రకటనపైనా రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అంతకముందు ఇదే అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టిన ప్రభుత్వం దాన్ని వెనక్కు తీసుకుంటూ ప్రకటన చేసింది. విశాఖలో రాజధాని అంటూ అక్కడ రిషికొండను ధ్వంసం చేసి భారీ ఎత్తున భవనాలు నిర్మించారు. వందల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన వస్తువులను దొంగలు ఎత్తుకుపోతున్నా ప్రభుత్వం మిన్నకుండి పోయింది. చివరకు రైతులే వాటిని అడ్డుకోవాల్సి వచ్చింది. అలాగే చట్ట ప్రకారం రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు కూడా నిరంతరం పెండింగ్‌ పెడుతుండటంతో దానికోసమూ రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. ఇలా ప్రభుత్వం చట్టపరంగా చేయాల్సిన పనులను పక్కనపెట్టేయడం, పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రతిదీ కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికీ వేయనన్ని మొట్టికాయలు హైకోర్టు సిఎంకు, వైసిపి ప్రభుత్వానికి వేసింది. ఎన్నికల్లో టిడిపి గెలవడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయని రైతు ప్రతినిధులు రామారావు, నరసింహారావు పేర్కొన్నారు.

➡️