సిఎం జగన్‌పై దాడి -కనుబొమ్మపై గాయం

-బస్సులోనే ప్రథమ చికిత్స
– మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ప్రజాశక్తి-విజయవాడ, అర్బన్‌, సింగ్‌నగర్‌, గన్నవరం :విజయవాడలో శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహనరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజలకు జగన్‌ అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి పూలతోపాటు విసిరిన రాయి అత్యంత వేగంగా వచ్చి ఆయన కనుబమ్మ పైభాగంలో తాకింది. దీంతో, సిఎంకు గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపు యాత్రను నిలుపుదల చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిఎంను టాప్‌పై నుండి బస్సులోకి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సిఎం జగన్‌ బస్సులోనే కూర్చొని యాత్రను కేశరపల్లి వరకు కొనసాగించారు. అయితే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్‌)కు వెళ్లి ఆయన చికిత్స అందుకున్నారు. ముఖ్యమంత్రి భార్య వైఎస్‌ భారతి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కాగా దాడి సమయంలో ముఖ్యమంత్రి సిఎం పక్కనే ఉన్న వైసిపి సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు, అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి గాయమైంది. రోడ్‌ షోకు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకే టిడిపి వారు దాడికి పాల్పడ్డారని వెలంపల్లి ఆరోపించారు.

త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోడీ
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

స్టాలిన్‌, చంద్రబాబు ఖండన
జగన్‌పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తదితరులు ఖండించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. రాజకీయాలు ఎప్పుడూ హింసాత్మంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.

సమగ్ర విచారణ జరిపించాలి : సిపిఎం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రాయి విసిరిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఘటన దురదృష్టకరం: షర్మిల
జగన్‌పై జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఖండించాల్సిందేనని తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

సిఎం బస్సుయాత్రకు ఘన స్వాగతం
కనక దుర్గ వారథి మీదుగా శనివారం సాయంత్రం 5.30 గంటలకు సిఎం బస్సు యాత్ర విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. భారీ క్రేన్ల సాయంతో గజమాలలను వేశారు. బస్సు యాత్ర వాటర్‌ ట్యాంక్‌ రోడ్‌, శిఖామణి సెంటరు, చుట్టుగుంట, బిఆర్‌టిఎస్‌ రోడ్‌, భగత్‌సింగ్‌ రోడ్డు, సింగ్‌నగర్‌, కండ్రిక మీదుగా రామవరప్పాడు రింగ్‌ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుంది. విజయవాడ నగరంలో సుమారు మూడున్నర గంటలకుపైగా సాగింది. అనంతరం రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు మీదుగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ బైపాస్‌ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు యాత్ర చేరుకుంది. విజయవాడ ఎంపి కేశినేని నాని, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.

➡️