దాతల సహకారంతోగుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

Dec 19,2023 08:42

ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : అడుగుకో గుంత.. నిత్యం నరకప్రాయం.. ప్రయాణికుల అగచాట్లు…ఆటోల మరమ్మతులు…వైసిపి ప్రభుత్వంలో రహదారుల నరకప్రాయంతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు..దాతల సహకారంతో రహదారులపై ఏర్పడిన గుంతలను గ్రావెల్‌ మట్టితో పూడ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం- వేములపాడుకి సంబంధించిన రోడ్డు బాలాజీనగర్‌ నుంచి శ్రీరామ్‌నగర్‌ వరకూ ఉంది. ఈ రహదారి గుంతలమయంగా మారిపోయింది. ప్రయాణికులు ఆటో ఎక్కాలంటే భయపడే స్థాయికి వచ్చారు. మరోవైపు ఆటోలు నిత్యం మరమ్మతులకు గురవుతుండడంతో ఆటో డ్రైవర్లు విసిగి వేశారిపోయారు. నేతాజీ ఆటో యూనియన్‌ సభ్యులందరూ దాతల సహకారంతో గ్రావెల్‌ మట్టిని తీసుకొచ్చి గురుకుల పాఠశాల నుంచి ఎండిఒ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయం మీదుగా మట్టి పోసుకుంటూ శ్రీరాంనగర్‌ వరకు గుంతలని పూడ్చుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా నేతాజీ ఆటో యూనియన్‌ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆటోలో ఎక్కిన జనం గుంతల తాకిడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించిన తామంతా దాతల సహకారంతో గుంతలను పూడ్చివేశామని తెలిపారు.

➡️