అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలి

  • తెలంగాణ హై కోర్టులో సిబిఐ కౌంటర్‌ దాఖలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు గురికాకుండా కాపాడాలంటే వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ హైకోర్టును కోరింది. బెయిల్‌ షరతులను అవినాష్‌ రెడ్డి ఉల్లంఘించారని తెలిపింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వేసిన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కౌంటర్‌ను న్యాయమూర్తి పరిశీలించారు. ”అవినాష్‌రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు. ఈ కేసులో పలువురు సాక్షులను వారు ఇప్పటికే ప్రభావితం చేశారు. వివేకా హత్యకేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్‌. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ నిందితులు బెదిరిస్తున్నట్టు దస్తగిరి చెబుతున్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరిని, ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలి” అని సిబిఐ తరుపున అడ్వకేట్‌ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఏప్రిల్‌ 19కి వాయిదా పడింది.

➡️