బాలశౌరి గన్‌తో బెదిరించి బీ ఫారాలు లాక్కున్నారు

Apr 7,2024 21:32 #congress leader, #press meet

నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరోపణ
ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :మచిలీపట్నం ఎంపి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి తమను తుపాకితో బెదిరించి బి-ఫారాలు లాక్కున్నారని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు డి నాగేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ విజయవాడలోని హోటల్‌ ఐలాపురం వద్ద మాట్లాడుకుందామని శుక్రవారం రాత్రి బాలశౌరి పిలిచారని, వెళ్లిన తమను గన్‌తో బెదిరించి 10 ‘బి’ ఫారంలు లాక్కెళ్లారని ఆరోపించారు. వీటిల్లో రెండు ఎంపి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినవని చెప్పారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్‌ వచ్చిందని, గాజుగ్లాసు బ్యాలెట్‌లా కనిపించే ఈ గుర్తు వల్ల జనసేనకు నష్టం కలుగుతుందనే దురుద్దేశంతో బెదిరిస్తున్నారని తెలిపారు. తాము పోలీస్‌స్టేషన్లోనూ, డిజిపికి బాలశౌరిపై ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ కూడా స్పందించాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, జి రామారావు, షేక్‌ బాషా, షేక్‌ మస్తాన్‌, ఎస్‌డి సయ్యద్‌, ఎస్‌కె గబ్బర్‌ పాల్గొన్నారు.

➡️