4న బంద్‌ జయప్రదం చేయాలి

  • విద్యార్థి సంఘాల పిలుపు
  • పోస్టరు ఆవిష్కరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థి సంఘాల కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. నీట్‌, నెట్‌ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్‌లపై సమగ్ర విచారణ జరపాలని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జులై 4న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌యు, పిడిఎస్‌యు, పిడిఎస్‌ఒ సంఘాల నాయకులు పోస్టరును సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎ అశోక్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌, కిరణ్‌, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. నీట్‌, నెట్‌ లీకేజ్‌లతో లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. ఐదేళ్లుగా 65 పేపర్లు లీక్‌ అయ్యాయని, కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విమర్శించారు. ఇవన్నీ తెలిసి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎగ్జామ్‌ అనే ముసుగులో మొత్తం పరీక్ష వ్యవస్థ కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్‌టిఎను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిహెచ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️