‘బరి’తెగింపు

Jan 15,2024 10:38 #Sankranti festival
  • భారీ ఏర్పాట్లతో యథేచ్ఛగా కోడి పందాలు, జూదం
  • తాళ్లపూడిలో బౌన్సర్ల ఏర్పాటు
  • చేతులు మారిన కోట్లాది రూపాయలు
  • అమలుకు నోచని హైకోర్టు ఆదేశాలు

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. నిర్వాహకులు షామియానాలు, కుర్చీలు, ఫ్లడ్‌ లైట్ల వెలుతురు మధ్య అట్టహాసంగా గుండాట, పేకాట వంటి జూదం కూడా పెద్ద ఎత్తున సాగింది. జాతరను తలపించింది. ఆదివారం కోట్లాది రూపాయలు చేతులు మారాయి. రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కోడి పందాల వద్ద నిర్వాహకులు బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహించకుండా జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ప్రయోజనం లేకుండా పోయింది. వీటిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కొన్నిచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిడితో పోలీసులు ప్రేక్షపాత్ర వహించారు. కోడి పందాలను పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందాలు సాగాయి. భట్టిప్రోలు మండలం ఓలేరు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి-216 పక్కన రెండేళ్ల క్రితం నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లో కోడి పందాల బరిని ఏర్పాటు చేశారు. పల్లికోనలో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో బరులను ఏర్పాటు చేసి ఒకటి నుండి ఐదు నెంబర్లు కేటాయించారు. ఒకటో నెంబర్‌ బరిలో లక్ష రూపాయల నుండి ఆ పైన పందాలు, రెండో నెంబర్‌ బరిలో రూ.50 వేల నుండి లక్ష రూపాయలు, మూడో నెంబర్‌ బరిలో రూ.20 వేల నుండి 50 వేలు, నాలుగో నెంబర్‌ బరిలో రూ.5 వేల నుండి రూ.20 వేల వరకు పందాలు కొనసాగుతున్నాయి.

కృష్ణా జిల్లాలో ఆదివారం ఒక్క రోజే రూ.80 కోట్లకు పైగా చేతులు మారినట్లు సమాచారం. మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్‌కు వెళ్లే రోడ్డు పక్కన మేకవానిపాలెంలో నిర్వహించిన కోడి పందాల శిబిరానికి మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాలనుంచి వేలాదిగా తరలి వచ్చారు. ప్రాంగణ మంతా కారులు, బైక్‌ల పార్కింగ్‌తో నిండిపోయింది.

ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, షేర్‌ మహమ్మద్‌ పేట, అనుమంచిపల్లి గ్రామ సమీపంలో కోడి పందాలతో పాటు గుండాట, పేకాట పెద్ద ఎత్తున నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుండి వచ్చి కోడి పందాలు కాశారు. ఐతవరం మామిడి తోటలో కోడి పందాలను ఎంఎల్‌సి మొండితోక అరుణ్‌ కుమార్‌, నందిగామ ఎఎంసి చైర్మన్‌ మస్తాన్‌ ప్రారంభించారు. కోడి పందాల నియంత్రణలో విఫలమైనందుకు నందిగామ ఎసిపి జనార్థన్‌నాయుడును విఆర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 250కుపైగా బరుల్లో జరిగిన కోడి పందాల్లో ఒక్క రోజే రూ.50 కోట్ల మేర చేతులు మారినట్లు అంచనా. వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. కాళ్ల మండలం పెదఅమిరంలో వైసిపి ఆధ్వర్యంలో, సీసలిలోని టిడిపి ఆధ్వర్యాన పందేలు పోటాపోటీగా సాగాయి. నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు భీమవరంలోనూ, పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తన సొంతూరు బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులోనూ ప్రారంభించారు. పాలకొల్లు రూరల్‌ మండలం సగం చెరువు వద్ద ఇరుగ్రూపుల గొడవలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇనుపరాడ్డుతో కొట్టాడని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని పందెంరాయుళ్లు చెబుతున్నారు. కాకినాడలో ఎస్‌పి కార్యాలయానికి కూత వేట దూరంలోని గొడారిగుంట, గైగోలుపాడు కోడి పందాలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే కాకినాడ జిల్లాలో రూ.30 కోట్ల వరకూ చేతులు మారినట్లు సమాచారం. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన, ఆత్రేయపురం, ఉప్పలగుప్తం, కపిలేశ్వరపురం మండలాల్లోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా కోడి పందాలు సాగాయి.

హోం మంత్రి నియోజకవర్గంలోనూ…

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తోన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోనూ కోళ్లు కత్తి దూశాయి. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో 23 బరులలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగాయి. అధికార పార్టీ సర్పంచులు, ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో వీటి నిర్వహణ జరగడంతో అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్తున్నారు. తాళ్లపూడి మలకపల్లిలో కోడి పందాల వద్ద నిర్వాహకులు బౌన్సర్లను ఏర్పాటు చేశారు.

టివి విలేకరిపై నిర్వాహకుల దాడి

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసరలంకలో భారీగా ఏర్పాటు చేసిన బరిలో కోడి పందాలు నిర్వహించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్టాండ్‌ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఓ టివి విలేకరి చిత్రీకరిస్తుండగా నిర్వాహకులు దాడి చేసి ఆయనను గాయపరిచారు.

➡️