జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

Jun 5,2024 21:36 #Alluri District, #Viral Fever
  • అల్లూరి జిల్లా డిఎంహెచ్‌ఒ జమాల్‌బాషా

ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : మలేరియా, ఇతర జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సి జమాల్‌ బాషా తెలిపారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ శివారు పివిటిజి గ్రామమైన చింతగున్నలులో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఆ గ్రామంలో గత నెలలో మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎపడిమిక్‌ సీజన్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు వంటి వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేశారు. దోమలు అభివృద్ధి చెందకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. తొలుత ఆయన మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి, మాతా శిశు మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిహెచ్‌సి వైద్యాధికారి ఎ గోపాలకృష్ణకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మినుములూరు సబ్‌ సెంటర్‌లో జరుగుతున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట మినుములూరు వైద్య సిబ్బంది ఎలీషారావు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

➡️