భానుడు భగభగ

Apr 3,2024 10:53 #Summer
  • 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • అత్యంత వేడి సంవత్సరంగా 2024
  • అప్రమత్తంగా వుండాలని ఐఎమ్‌డి హెచ్చరిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎమ్‌డి ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డుస్థాయిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా వుంటాయని భారత వాతావరణశాఖ చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు చాలా ప్రాంతాల్లో ఈ ఏడాదికి అత్యధికంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కనిగిరి మండలంలో, కడప జిల్లాలోని చాపాడు మండలంలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నంద్యాల జిల్లా మహానంది మండలంలో 43.7, కర్నూలు జిల్లా గూడూరు మండలంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం, పల్నాడు, కృష్ణా, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా 2016 మే 2న ప్రకాశం జిల్లాల్లోని వెలిగొండలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

➡️