సమిష్టి కృషి, భాగస్వామ్యంతోనే జీవ వైవిధ్య పరిరక్షణ

– రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :అన్ని వర్గాల ప్రజల సమిష్టి కృషి, భాగస్వామ్యంతోనే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, తద్వారా 2030 నాటికి అన్ని రంగాలకు సుస్థిరమైన పర్యావరణాభివృద్ధి ఫలాలు అందుతాయని, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు తీవ్ర కృషి చేస్తోందని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు చిరంజీవి చౌదరి (ఐఎఫ్‌ఎస్‌) తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయు కన్వెన్షన్‌ హాలులో బుధవారం నిర్వహించిన జాతీయ స్థాయి జీవ వైవిధ్య దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు. సుస్థిర పద్ధతిలో ప్రయోజనాలు అందించేందుకు, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాయుత చర్యలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జీవ వైవిధ్య పరిరక్షణ, జీవ వనరుల స్థిరమైన వినియోగం, అన్ని వాటాదారుల మధ్య జీవ వనరుల న్యాయమైన, సమానమైన భాగస్వామ్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలను రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు నిర్దేశించుకుందని వెల్లడించారు. జీవవైవిణ్య పరిరక్షణ ఆవశ్యకత, స్థిరమైన వినియోగంపై అవగాహన పెంచడానికి ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం మే 22న జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ”ప్రణాళికలో భాగస్వామ్యం అవ్వండి” అనే అంశం ఆధారంగా ఈ సంవత్సరం రెండు రోజుల జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు సుస్ధిర ప్రయోజనాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆంధ్రా యూనివర్శిటీ విసి పివిజిడి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాబోయే 50 ఏళ్లలో సమాజంలోని అన్ని రంగాల, వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయు ప్రధాన కేంద్రంగా బయో డైవర్సిటీ పార్కును నెలకొల్పుతున్నామని, ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని తెలిపారు. 15 నుంచి 80 ఏళ్ల వయస్సు కలిగిన 27,800 రకాల వృక్షజాతులు ఎయులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో స్టేట్‌ బయో డైవర్సిటీ బోర్డు సభ్యులు బివిఎ.కృష్ణమూర్తి, విశాఖపట్టణం జిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఎస్‌.శ్రీకాంత్‌నాథ్‌రెడ్డి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ ప్రతినిధి ప్రొఫెసర్‌ హంచినల్‌ రాయప్ప, వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ విసి టి.జానకీరామ్‌, డిఎఫ్‌ఒ అనంత్‌ శంకర్‌, జ్యూ క్యురేటర్‌ నందినీ సలారియా, రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️