దేశభక్తి ముసుగులో బిజెపి నాటకాలు

  • మోడీ హయాంలో పెరిగిన అవినీతి
  • ‘బిజెపి వాగ్దానాలు – వైఫల్యాలు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : దేశభక్తి ముసుగులో బిజెపి నాటకాలు ఆడుతోందని, ఆ ప్రభుత్వ హయాంలో గడిచిన పదేళ్లలో అవినీతి విపరీతంగా పెరిగిందని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ అన్నారు. ‘బిజెపి వాగ్ధానాలు – వైఫల్యాలు’ అనే అంశంపై భారత్‌ బచావో సంస్థ ఆధ్వర్యాన విశాఖలో ఆదివారం సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పరకాల హాజరై మాట్లాడారు. బిజెపి హయాంలో నిరుద్యోగం పెరిగిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బిజెపి పాలన సాగిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. తాను రచించిన ‘ది క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తకాన్ని ప్రచురించడానికి కొంతమంది ప్రచురణకర్తలను మెయిల్స్‌ ద్వారా సంప్రదించగా ఎవ్వరూ స్పందించకపోవడం బాధ అనిపించిందన్నారు. రూ.లక్షల కోట్లు అవినీతి సొమ్మును వెనక్కి తెస్తానని చెప్పి గద్దెనెక్కిన బిజెపి ఆ అవినీతిని మరింత పెంచి పోషించిందని ఆరోపించారు. భారత్‌ బచావో సంస్థ ఎపి చైర్మన్‌ సి.భాస్కరరావు మాట్లాడుతూ దేశాన్ని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించిందని విమర్శించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ బిజెపి మేనిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, యువతను ఎలా మోసగించారో వివరించారు. ‘ది క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తకంలో దేశం ఎటువైపు ప్రయాణిస్తుందో స్పష్టంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ నిర్వీర్యం చేశారన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలని ఇసిని కోరారు. సదస్సులో పరకాల ప్రభాకర్‌ రచించిన ‘ది క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తకంపై పలువురు వక్తలు మాట్లాడారు. భారత్‌ బచావో సంస్థ విశాఖ అధ్యక్షులు ఎస్‌ఆర్‌.వేమన అధ్యక్షతన జరిగిన సదస్సులో జై భారత్‌ నేషనల్‌ పార్టీ వ్యవస్థాపకులు వివి.లక్ష్మీనారాయణ, సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు శీతల మదన్‌, కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌, క్రిస్టియన్‌ మైనార్టీ సంఘం నాయకులు జి.స్వామినాథన్‌, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్‌ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

➡️