ప్లాట్ల రద్దు చెల్లదు : హైకోర్టు కీలక ఉత్తర్వులు

Feb 28,2024 09:32

ప్రజాశక్తి-అమరావతి : ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో భాగంగా రాజధాని అమరావతి రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సిఆర్‌డిఎ తీసుకున్న ఈ చర్య చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది. ప్లాట్ల కేటాయింపుపై చట్టం నిర్దేశించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్‌డిఎ ఉల్లంఘించాయని తేల్చింది. ప్లాట్ల రద్దుకు ముందు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలన్న ప్రాథమిక అంశాన్ని ఉల్లంఘించారని, నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలను స్వీకరించకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రకటించింది. ఈ చర్య సివిల్‌ వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా ఉందని పేర్కొంది. ప్లాట్ల యజమానులకు నోటీసులిచ్చి వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నాకే రద్దుపై రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. తామిచ్చిన ఉత్తర్వులు చట్ట ప్రకారం రైతులకు మరోచోట ప్లాట్ల కేటాయించేందుకు అడ్డంకి కాబోదని రాష్ట్ర ప్రభుత్వానికి, సిఆర్‌డిఎకు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జి నరేందర్‌, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం తీర్పు చెప్పింది. రాజధాని అమరావతిలో భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట కేటాయింపు చర్య ఏకపక్షమని పేర్కొంటూ కొండెపాటి కరుణ ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రం, సిఆర్‌డిఎ సవాల్‌ చేసిన అప్పీల్‌పై డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వేరే చోట్ల ప్లాట్లు తీసుకునేందుకు సమ్మతించిన రైతులకు చట్ట ప్రకారం చేయాలని, మిగిలిన వారి ప్లాట్లను రద్దు చేయరాదని పేర్కొంది.

డివిజన్‌ బెంచ్‌ స్పందిస్తూ.. ‘తమ తీర్పు ప్రతి అధికారికంగా అందిన వారం రోజుల్లో ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలి. ఆ నోటీసుల్లో ప్లాట్లను ఎందుకు రద్దు చేయాల్సి వస్తుందో వివరించాలి. ఏ చట్ట నిబంధన కింద ఆ చర్య తీసుకునేదీ స్పష్టం చేయాలి. ప్లాట్ల యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరణకు 3 వారాల గడువు ఉండాలి. ఆ తర్వాత రైతుల వాదనలకు 2 వారాల గడువు ఉండాలి. ఆపై ప్లాట్లను రద్దు చేస్తూ రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి’ అని ఆదేశించింది. సిఆర్‌డిఎ చట్టం ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద తీసుకున్న భూముల్లో మాత్రమే రైతులకు ప్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. కొందరికి భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిలో కూడా ప్లాటు కేటాయించారని చెప్పారు. అందుకే ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకుందన్నారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాదులు సాయి సంజరు సూరనేని, కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదిస్తూ.. సిఆర్‌డిఎ చర్య ఏకపక్షమని, చట్ట వ్యతిరేకమని చెప్పారు. ప్లాట్ల యజమానుల వాదనలు వినేందుకు ఆస్కారం లేకుండా ఏకపక్షంగా రద్దు చేయడం చట్ట విరుద్ధమన్నారు.

➡️