పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనలో ముగ్గురు వైసిపి నేతలపౖౖె కేసు

Apr 10,2024 20:10 #Case, #Perni Nani's followers

ప్రజాశక్తి-కృష్ణాప్ర్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌పై చిలకలపూడి స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. 18, 33 డివిజన్‌ల కార్పొరేటర్లు మేకల వెంకట సుధాకరబాబు (సుబ్బన్న), మీర్‌ మహ్మద్‌ సయ్యద్‌(అస్గర్‌)లతోపాటు అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ జువ్వాది రాంబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా 144 సెక్షన్‌ అతిక్రమించారని సెక్షన్‌ 188, ఉద్దేశ్యపూర్వకంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద గలాటా సృష్టించారని సెక్షన్‌ 143, సిసి కెమెరా, ఫర్నిచర్‌, పోలీసు జీపు సైరన్‌ ధ్వంసం చేశారనే కారణంతో సెక్షన్‌ 427 కింద కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద సెంట్రీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
మూడు రోజుల క్రితం పోతేపల్లి పంచాయతీ పరిధిలోని ఉల్లిపాలెంలో నిర్వహించిన నూకాలమ్మ జాతర సంబరాల్లో జరిగిన దాడికి సంబంధించి మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, తమను ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిచి కొట్టారని వైసిపి కార్యకర్తలు ఆరోపించారు. దీంతో పోలీసు స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) తన అనుచరులతో కలిసి మంగళవారం పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. వైసిపి కార్యకర్తలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ చాణక్యను విఆర్‌కు పంపినట్లు సమాచారం.

➡️