ఉద్యోగినికి సిఇఒ వేధింపులు

Feb 4,2024 11:55 #CEO, #employee, #harassment, #hyderabad

యూసుఫ్‌గూడ (హైదరాబాద్‌) : ఓ సిఇఒ మీటింగుల పేరుతో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ వేధిస్తుండటంతో ఆమె మధురానగర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మధురానగర్‌ పోలీసుల వివరాల మేరకు … నగరానికి చెందిన యువతి అమీర్‌పేట్‌లోని ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌, లీగల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉంటున్న అదే కంపెనీ సిఇఒ తొండెపుచంద్రతో జూమ్‌ మీటింగ్‌లో పాల్గనేవారు. ఈ సమావేశాల్లోనే సిఇఒ అసభ్యంగా మాట్లాడేవారు. గతేడాది డిసెంబరు 22వ తేదీన అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చంద్ర 23వ తేదీన అమీర్‌పేట్‌లోని కార్యాలయంలో మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఉద్యోగినిని వేధించాడు. జనవరి 2న నెక్లెస్‌ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు రప్పించి తన కోరిక తీర్చాలని డిమాండ్‌ చేయగా ఆమె నిరాకరించారు. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసున్నట్లు ఈ-మెయిల్‌ ద్వారా ఆమె సమాచారమిచ్చారు. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరారు. చంద్ర అందుకు నిరాకరించడంతో పాటు మళ్లీ వేధింపులకు దిగడంతో ఆమె మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️