పోరాటాలతో మార్పు

Jun 15,2024 06:34 #BV Raghavulu, #speech

-బిజెపికి సీట్లు అందువల్లే తగ్గాయి
-ఉధృత పోరాటాలతొనే ‘పర్స’కు నివాళి
శత జయంతి సభలో బివి రాఘవులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పోరాటాలకు రాజకీయాలను మార్చే శక్తి ఉందని సిఐటియు మాజీ ప్రధాన కార్యదర్శి, సిపిఎం పొలిట్‌ బ్యూరోసభ్యులు బివి రాఘవులు అన్నారు. సిఐటియు ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ సాయుధ పోరాట యోధులు పర్స సత్యనారాయణ శతజయంతి సభ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ దేశంలో ఎన్‌డిఎ, బిజెపిలకు సీట్లు తగ్గడానికి, రాష్ట్రంలో వైసిపి అధికారం కోల్పోవడానికి పోరాటలే కారణమని వివరించారు. హానికరమైన, చెడ్డ రాజకీయాలకు ఎదురుదెబ్బ కొట్టే శక్తి పోరాటాలకు ఉందన్నారు.రానున్న రోజుల్లో ఆ పోరాటాలను మరింత ఉధృతంగా కొనసాగించడమే పర్స సత్యనారాయణకు నివాళి అని చెప్పారు. పర్స సత్యనారాయణ పోరాట యోధుడని, యువతను ఉద్యమాల వైపు ఆకర్షించడంలో దిట్ట అని, రాష్ట్రంలో సిఐటియు ఆవిర్భావంలో కీలక పాత్ర పర్స పోషించారని వివరించారు. ఎన్‌డిఎకు 400కు పైగా బిజెపికి సొంతంగా 370 సీట్లు వస్తాయని ఎన్నికల ముందు ప్రచారం చేశారని, చివరకు చావు తప్పి కన్నులోట్టబోయిన్నట్లుగా ఫలితాలు వచ్చాయని చెప్పారు. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు దేశవ్యాప్తంగా పోరాటం చేశారని చెప్పారు. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బిజెపి చాలా సీట్లు కోల్పోయిందని వివరించారు. అగ్నివీర్‌ పథకానికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయడంతో పాటు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మెజార్టీ కూడా 3లక్షల నుంచి లక్షకు పడిపోయిన విషయాన్ని కౌంటింగ్‌ తొలిదశలో వెనుకబడి ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ఫలితంగానే వైసిపి ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. వేతనాల పెంపు కోసం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్‌ కార్మికులు ఇతర ఉద్యోగులు ఆందోళన నిర్వహించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి 40శాతం ఓట్లు వస్తే స్టీల్‌ ప్లాంట్‌ ఉన్న విశాఖపట్నం జిల్లాలో 30శాతమే వచ్చాయని తెలిపారు. ఇటీవల జరిగిన మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంబానీ, గౌతమ్‌ అదానీ వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేసేలా సంస్కరణలు తేవాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసిందని చెప్పారు. రాష్ట్రాల హక్కులు తొలగించేలా, రైతులకు ఆదాయం తగ్గేలా, కార్మికుల హక్కులు తీసేసే విధంగా రాబోయే కాలంలో సంస్కరణలు రాబోతున్నాయని చెప్పారు. విపరీతమైన భారాలు ప్రజలపై పడబోతున్నాయని, వీటికి వ్యతిరేకంగా పోరాటాల ఉధృతమవుతాయని చెప్పారు. గతం కంటే ఈ సారి పట్టుదలగా ఉదృతంగా పోరాటం చేస్తే విజయం సులువుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసిపికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. తమకు 15 మంది ఎంపిలు ఉన్నారంటూ జగన్‌ బిజెపికి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల తరపున, ఎన్‌డిఎ ప్రజా వ్యతిరేక విధానాలపైనా పోరాటం చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు హామీలపై చంద్రబాబు సంతకాలు చేయడాన్ని స్వాగతించారు. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు భజన చేస్తారా, లేదంటే ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారో తేల్చుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రభుత్వ రంగంలో ఉంచితే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరూ కదిలించకుండా చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకునే ప్రమాదకరమైన నిర్ణయాలపై టిడిపి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలని చెప్పారు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహంపై, విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేయాల్సిందేనని తెలిపారు. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలోకి కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ 72 ఏళ్ల పోరాట చరిత్ర పర్సకు ఉందన్నారు. సింగరేణిలో సాధారణ
ఉద్యోగిగా చేరిన నాటి నుంచే కార్మిక సమస్యలపై యాజమాన్యానికి లేఖలు రాశారని వివరించారు. పత్రిక ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచారని తెలిపారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు, పర్స అల్లుడు మంతెన సీతారాం మాట్లాడుతూ పరిపూర్ణ కమ్యూనిస్టు జీవితాన్ని పర్స గడిపారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దళ నాయకుడిగా ఉండి జైలు జీవితం గడిపారని చెప్పారు. పర్స చూపిన ఆదర్శ బాటలో నడవాలని అధ్యక్షత వహించిన ఎవి నాగేశ్వరరావు అన్నారు. పర్సతో ఉన్న జ్ఞాపకాలను ఆయన కుమార్తెలు లీలా, పద్మ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆఫీస్‌బేరర్స్‌ వి ఉమామహేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావు, పి అజరు కుమార్‌, ధనలక్ష్మీ, కె సుబ్బరావమమ్మ, కెఆర్‌ఎస్‌ మూర్తి, రాష్ట్ర నాయకులు సిహెచ్‌ బాబూరావు తదితరులు పాల్గన్నారు. అంతకుముందు పర్స చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️