‘స్కిల్‌’ కేసులో చంద్రబాబుపై ఛార్జిషీట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో సిఐడి అధికారులు గురువారం విజయవాడ ఎసిబి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కె అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు తదితర పేర్లను ఛార్జిషీట్‌లో పొందుపరిచారు. స్కిల్‌ డెవలప్‌మెంటు కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నారని ఆ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు చేయటానికి సిమెన్స్‌, డిజైన్‌ టెక్‌లకు రూ.371 కోట్ల గ్రాంటును ఎపి ప్రభుత్వం ఇస్తున్నట్లు అచ్చెన్నాయుడు, చంద్రబాబు అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపి, ఆ డబ్బులో ఎక్కువ సొమ్మును వీరిరువురూ స్వాహా చేశారని ఛార్జిషీట్‌లో పొందుపరిచారు. జిఒఎంఎస్‌ నెంబరు 4కు విరుద్ధంగా నగదును విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఛార్జిషీట్‌కు సంబంధించిన నిర్ధారణ కాపీలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమర్పించామని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని ఆ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

➡️