ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరుగురు నిందితులపై చార్జిషీటు

పరారీలో ఇద్దరు నిందితులు
– వ్యూహప్రకారమే ట్యాపింగ్‌ చేశారని అభియోగం
– ఇద్దరు నిందితుల బెయిల్‌పై నేడు నిర్ణయం
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ స్కామ్‌లో మొత్తం ఆరుగురు నిందితులపై మంగళవారం నాంపల్లి కోర్టులో కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట స్పెషల్‌ టీమ్‌ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఐజి మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డిసిపి, ఎస్‌ఐజీ మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు, ఐ న్యూస్‌ ఛానల్‌ సిఇఒ శ్రవణ్‌కుమార్‌పై చార్జిషీట్‌ దాఖలైంది. అందులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌ పరారీలో ఉన్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నాయకులు, వ్యాపారులు, సెలబ్రెటీలు, ప్రముఖులు, ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లపై ఒక వ్యూహం ప్రకారం పై నిందితులు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ముఖ్యంగా ఎస్‌ఐజి మాజీ ఐజి ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు టీమ్‌గా ఏర్పాటు చేసి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని పేర్కొన్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో విపక్షాలకు చెందిన వారి నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడి భారీ మొత్తంలో వారికి చెందిన కోట్ల రూపాయల డబ్బులను సీజ్‌ చేశారని చార్జిషీట్‌లో వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ఎస్‌ఐజి కార్యాలయంలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి పదిహేడుకుపైగా కంప్యూటర్లతో వాటికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను అమర్చి మరీ ఆపరేషన్లకు పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. వీరంతా కలిసి దాదాపు 1400 వందల మందికిపైగా ప్రముఖుల ఫోన్లట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రభాకర్‌రావు ఆదేశాలు, సూచనల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిపామనీ, ఐన్యూస్‌ సిఇఒ శ్రవణ్‌కుమార్‌ కూడా కీలక పాత్ర పోషించారని పట్టుబడ్డ నిందితులు తమ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతేడాది డిసెంబర్‌ నెలలోనే ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌లకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, సాంకేతిక పరికరాలను ధ్వంసం చేసి నిందితుల్లో ఒకరైన ప్రణీత్‌రావు ఆ సామాగ్రిని మూసీ నదితో పాటు బేగంపేట కాలువలో పారేసి ఆధారాలను మాయం చేయడానికి కుట్ర పన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. గత మార్చి పదో తేదీన ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన దానికంటే కొద్ది రోజుల ముందు మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌ దేశం విడిచి పారిపోయారనీ, వారి కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో మరిన్ని నిజాలతో పాటు ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రేరేపించిన అప్పటి ప్రభుత్వ ప్రముఖుల వివరాలు బయటపడే అవకాశాలుంటాయని ఈ చార్జిషీట్‌లో సూచనప్రాయంగా తెలిపినట్టు సమాచారం.
బెయిల్‌పై నేడు నిర్ణయం
ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితులైన అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలకు బెయిల్‌ ఇచ్చే విషయంపై నాంపల్లి కోర్టు నేడు నిర్ణయం తీసుకోనున్నది. మంగళవారం వీరిద్దరికీ బెయిల్‌ ఇచ్చే విషయంపై నాంపల్లి కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో పాటు నిందితుల తరఫు న్యాయవాదుల మధ్య వాదప్రతివాదనలు జరిగాయి. కాగా, ఈ కేసులో ఇద్దరు అధికారులను ఉద్దేశపూర్వకంగా నిందితులుగా చేర్చారనీ, వారికి బెయిల్‌ మంజూరు చేయాలంటూ నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు పలు ఆధారాలున్నాయనీ, ఈ నేపథ్యంలో వీరిద్దరి నిందితులకు బెయిల్‌ లభిస్తే వారు ఆధారాలను తారుమారు చేసే ప్రమాదముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి వారిద్దరి బెయిల్‌ మంజూరుపై నిర్ణయాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.

➡️