నన్ను చంపేందుకు చెవిరెడ్డి కుట్ర

చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని
ప్రజాశక్తి – తిరుపతి : ఓటమి భయంతోనే, తనను చంపేందుకు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తనపై హత్యాయత్నం చేశారని చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ గేట్‌ ఎదుట మంగళవారం మధ్యాహ్నం వైసిపి నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… ‘చంపేయండిరా.. బై ఎలక్షన్స్‌ వస్తాయి’ అంటూ వైసిపి మూక తనపై హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. గన్‌మెన్‌ లేకపోయింటే తనను కచ్చితంగా చంపేసే వారు అని తెలిపారు. ఇవిఎంలకు సీల్‌ వెయ్యలేదని, వీటిపై ఇసికి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఓటమిని భరించలేని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇలా తన అనుచరులతో హత్యాయత్నం చేయించడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
అంతకు మునుపు తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున పులివర్తి నాని భార్య సుధారెడ్డి తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు తిరుచానూరుకు వస్తున్న నేపథ్యంలో సుధారెడ్డిని ముందస్తుగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడిచిపెట్టారు. అయితే జిల్లా ఎస్‌పి, పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని సుధారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హత్యాయత్నానికి పాల్పడి ఒక్కరోజు గడిచిన, 30 మంది నిందితులకు సంబంధించిన వీడియో ఫుటేజీ అందించినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం: ఎస్‌పి కృష్ణ కాంత్‌ పాటిల్‌
తిరుపతి మహిళా యూనివర్సిటీ ఎదుట టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి ఎస్‌పి కృష్ణ కాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. పులివర్తి సుధా రెడ్డి, గన్‌మెన్‌ ధరణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. త్వరలోనే నిందితులందరినీ అరెస్ట్‌ చేస్తామన్నారు. తిరుపతిలో శాంతిభద్రతల నేపథ్యంలో 144 సెక్షన్‌లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో సిఆర్‌పిసి 144 ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

పులివర్తి నానికి పలువురి పరామర్శ
చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని బుధవారం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి ఎన్‌.అమర్నాథరెడ్డి, సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం, శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌ రెడ్డి, పలువురు టిడిపి నాయకులు పరామర్శించారు.

➡️