రెవెన్యూలో ప్రక్షాళనం

Dec 13,2023 22:03 #land records, #re surway

– భూ రికార్డుల సవరణలో ముందడుగు

– అనర్హులకు మంజూరు చేసిన పాస్‌ పుస్తకాలు తొలగింపు

-అర్హులకు భూ యాజమాన్య హక్కులు కల్పించండి- కలెక్టర్లకు సిసిఎల్‌ఎ ఉత్తర్వులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వే ఒక వైపు నిర్వహిస్తూనే మరో వైపు నిజమైన భూ రికార్డుల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి రెవెన్యూశాఖ ముందడుగు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో అనర్హులకు మంజూరు చేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను రద్దు చేసి, ఆయా భూములకు సంబంధించి అర్హులైన భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సిసిఎల్‌ఎ కమిషనరు సాయి ప్రసాద్‌ ఈ నెల 8న 26 జిల్లాల కలెక్టర్లకు ఉజారీ చేశారు. భూములకు సంబంధించి అసలైన పట్టాదారులు భూములపై లేరని, వారి స్థానంలో ఇతరులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందినట్లు తాము గుర్తించినట్లు ప్రభుత్వం దృష్టికి రెవెన్యూ యంత్రాంగం తీసుకెళ్లింది. ప్రభుత్వం నుంచి అనర్హులు పొందిన పట్టాదారు పాస్‌ పుస్తకాలతో అనేక మంది బ్యాంకుల్లో రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు పొందడం, భూములను తనఖాపెట్టి రుణాలు పొందడం జరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూమి తమది కాకపోయినా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సర్వే ప్రక్రియలో తప్పులు దొర్లకుండా ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. భూములు రీ సర్వే పూర్తయిన లేక ఇంకా సర్వే చేపట్టని గ్రామాల్లో భూ యజమానులు కాని వారిని రికార్డుల్లోంచి తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన పట్టాదారుల పేర్లను వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో చేర్చాలని, వారికి భూ యాజమాన్య హక్కు కల్పించాలని అన్నారు.

➡️