తెలుగు ప్రజలు ఎక్కడున్నా మనవారే…

పద్మ అవార్డు గ్రహీతలకు ప్రతినెలా రూ.25వేల పింఛను

పద్మ అవార్డు గ్రహీతలకు సిఎం సన్మానం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలుగు ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా మనవారేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా తెలుగు ప్రజలంతా ఏకమై ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం తరుపున ఎపింకైన పద్మవిభూషణ్‌ వెంకయ్యనాయుడు, పద్మవిభూషణ్‌ చిరంజీవి, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బుర్రవీణ కళాకారుడు కొండప్ప, చిందుయక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, సామాజికవేత్త కూరెళ్ల విఠలాచారి, శిల్పి అనంతాచారి, బంజారా సాహితీవేత్త సోమాలాల్‌, హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరిలను సిఎం రేవంత్‌, మంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. పద్మ అవార్డు గ్రహీతలైన గ్రామీణ కళాకారుల జీవితాలు అంత సుఖవంతంగా లేవని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.25 లక్షల పారితోషికంతో పాటు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీనియర్‌ నాయకుడు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాకపోవడం తనకు బాధకలిగించిందని అన్నారు. దేశ రాజధానిలో తెలుగువారి నాయకత్వం పెరగాలని ఆకాంక్షించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభూషణ్‌ రావడం ఆయన కృషికి గుర్తింపు అని కొనియాడారు. కులం, వర్గం, ప్రాంతం ప్రాతిపదికగా రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కళాకారులకు గద్దర్‌ పేరిట అవార్డులు ప్రకటించడం సముచితంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️