అర్హతే ప్రామాణికం

జగనన్న విదేశీ విద్యాదీవెన,

సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకంలో సిఎంరూ.42.60 కోట్లు విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలలో అర్హతనే ప్రామాణికంగా తీసుకున్నామని, సిఫార్సులు, రాజకీయ జోక్యం, అవినీతి, లంచాలు లేవని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక మొత్తాలను బటన్‌ నొక్కడం ద్వారా అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. విదేశాల్లో చదువుతున్న 390 మంది విద్యార్థులకు రూ.41.50 కోట్లను, సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన 95 మందిలో మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మందికి ప్రోత్సాహంగా మొత్తం రూ.42.60 కోట్లను జమచేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ 21 ఫ్యాకల్టీలలో టాప్‌ 50 కళాశాలల్లో ఎవరికి సీటు వచ్చినా రూ.1.25 కోట్ల వరకూ గరిష్టంగా పరిమితిపెట్టినట్టు చెప్పారు. పోటీ ప్రపంచంలో ఎదగాలనే ఇవన్నీ చేస్తున్నామని తెలిపారు. మంచి యూనివర్శిటీల్లో సీటు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయకుండా చదివిస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న తోడు ఉంటాడనే భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, వారి ఫీజుల కోసం రూ.9.50 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 408 మంది చదువుతున్నారని, ఈ సీజన్లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందిని కలుపుకుని మొత్తం రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడు ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచేలా చేస్తున్నామని చెప్పారు. అట్టడుగు వర్గాలు బాగుపడాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందుతున్న మొత్తం విద్యార్థుల్లో ఆర్థికంగా వెనుకబడినవారు 45 శాతం ఉంటే, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 55 శాతం ఉన్నారని తెలిపారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ రాస్తూ ప్రిలిమ్స్‌ పాసైన వారికి లక్ష, మెయిన్స్‌కు వెళితే ఇంకో రూ.50 వేలు అదనంగా వచ్చే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నిసార్లు రాసినా ఈ ప్రోత్సాహకం అందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో గత ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయకుండా చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఆన్‌లైన్‌ పద్ధతిలో పాల్గన్నారు. టాప్‌ యూనివర్శిటీల్లో సీటు పొందిన వారికి నేరుగా ప్రోత్సాహకం అందజేశారు.

➡️