vijayawada:అభివృద్ధిని చేతల్లో చూపాం

-‘కృష్ణా’ రిటైనింగ్‌ వాల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- విజయవాడ :రాష్ట్రంలో అభివృద్ధిని చేతల్లో చూపామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత 58 నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. విజయవాడలో రూ.620.93 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. విజయవాడ కృష్ణలంక వాసులు కృష్ణా వరద ముంపు బారిన పడకుండా నది వెంబడి రూ.369.89 కోట్లతో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ను, నదీ తీరంలో రూ.12.4 కోట్లతో నిర్మించిన రివర్‌ వ్యూ పార్క్‌ను ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.239 కోట్లతో చేపట్టిన సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. నగరంలో అర్హులైన 31,866 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకదుర్గ వారథి వద్ద జరిగిన కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2.26 కిలోమీటర్ల మేర రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కృష్ణలంక రణదీర్‌నగర్‌, కోటినగర్‌, తారకరామ నగర్‌, భూపేష్‌ గుప్తా నగర్‌, పోలీస్‌ కాలనీ, రామలింగేశ్వర నగర్‌ ప్రాంతాల్లోని సుమారు 80 వేల మంది నివాసితులకు కృష్ణా వరద ముంపు బారి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కృష్ణా నదికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ప్రజలు భయపడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రివర్‌ వ్యూ పార్క్‌కు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. మోడ్రన్‌ ఎంట్రీ ప్లాజా, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా, ఆహ్లాదకర వాతావరణంతో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ నగర వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. నగరంలో సుమారు రూ.400 కోట్లతో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా వెళ్లేందుకు ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. విమానాశ్రయానికి వెళ్లేందుకు గతంలో ఒక ఫ్లైఓవర్‌ కూడా ఉండేది కాదని, గత ఐదేళ్లలో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామని, కనక దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మరో రెండు నెలల్లో అవుటర్‌ రింగ్‌ రోడ్‌ కూడా ప్రారంభం కాబోతోందన్నారు. మంత్రి అంబటి రాంబాబు, ఎంపిలు కేశినేని నాని, మార్గాని భరత్‌, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సిఎస్‌ వై.శ్రీలక్ష్మి, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

➡️