పోస్టల్‌ బ్యాలెట్‌ను తగ్గించేందుకు కుట్ర : టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌ బాబు

Apr 21,2024 23:39 #MLC, #TDP, #uru #Ashokbabu

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపికి గుణపాఠం చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారని తెలిసి పోస్టల్‌ బ్యాలెట్లపై కుట్రలకు తెరలేపారని టిడిపి ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు విమర్శించారు. టిడిపికి ఓటు వేస్తారనే భయంతోనే తగ్గించేందుకు కొందరు అధికారులతో చేతులు కలిపి కుట్ర చేస్తుందని ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్లు నమోదు కాకుండా చేసేందుకు అయోమయానికి గురి చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ సర్క్యూలర్‌ అందకుండా చేశారని తెలిపారు. ఆదేశాలు లేవంటూ ఫారం 12ను తీసుకోవడం లేదని, ఫారం 12ను తీసుకున్నా ఎకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నోడల్‌ ఆఫీసర్లు ఎవరో ఇంకా స్పష్టత లేదన్నారు. ఫారమ్‌ 12ను ఉద్యోగస్తుల నుంచి తీసుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గాల్లో డ్యూటీలో ఉన్న ఎఆర్‌ఒ, ఆర్‌ఒలదేనని అన్నారు.
ఎన్నికల విధుల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌కు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వర్తించబోతున్నారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్లపై పిఒ, ఎపిఒలకు ట్రైనింగ్‌ ఇచ్చినట్లుగా ఒపిఒలకు శిక్షణ ఇవ్వాలని కోరారు.
జగన్‌ వల్లే ఐసియులో స్టీల్‌ ప్లాంటు : పట్టాభిరామ్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 90 శాతం ఉత్పత్తి పడిపోయిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. కోకింగ్‌ కోల్‌ దిగుమతి కోసం ఉన్న ప్రత్యేక బెర్త్‌, వందెకరాల స్టాక్‌యార్డ్‌ మాయం అయ్యాయని విమర్శించారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పోర్టు స్తంభించిందని, దీంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. గంగవరం పోర్టు మూసివేతకు, స్టీల్‌ ప్లాంట్‌ ఐసియులో చేరడానికి కారకుడు జగన్‌ అని విమర్శించారు.
పొలిట్‌బ్యూరోలోకి సీతారామలక్ష్మి
రాజ్యసభ మాజీ సభ్యులు తోట సీతారామలక్ష్మిని టిడిపి పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా, నరసాపురం పార్లమెంటు అధ్యక్షులుగా మంతెన రామరాజును నియమించారు. కొమ్మి లక్ష్మయ్య నాయుడును పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు.

➡️