నిర్మాణం…విధ్వంసం…పునర్నిర్మాణం

Jul 2,2024 08:06 #amaravathi, #white paper
  • సిద్ధమైన అమరావతి శ్వేతపత్రం
  • మూడు భాగాలుగా రూపకల్పన
  • రేపు విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిపై రెండవ శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది విశ్వసనీయ సమాచారం మేరకు అధికారయంత్రాంగం ఇప్పటికే ఈ శ్వేతపత్రాన్ని సిద్ధం చేసింది. తుది మెరుగులు దిద్ది బుధవారం విడుదల చేయనున్నారు. మూడు భాగాలుగా ఈ శ్వేతపత్రాన్ని రూపొందిస్తున్నారు. 2014 నుండి 2019 వరకూ ఏమి చేశారు. 2019 నుండి 2024 వరకూ ఏం జరిగింది? 2024 నుండి చేయాల్సిందేమిటి? అన్న అంశాలు కీలకంగా ఉన్నట్లు తెలిసింది.
మొదటి భాగంలో 2014లో ప్రకటన చేసినప్పటి నుండి పూలింగు, రైతుల సహాయ సహకారాలు, అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అమరావతి బ్రాండింగ్‌, నిధుల సమీకరణ అనే అంశాలను చేర్చారు. అలాగే రోడ్డు, పూలింగు ప్లాట్ల కేటాయింపులు, వాటిల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు సుమారు రూ.15 వేల కోట్లకు టెండర్లు, భవనాల ప్లాను, ఎజిసి కాంప్లెక్స్‌కు ర్యాఫ్ట్‌ వేయడం (గిన్నిస్‌ రికార్డు) వంటి అంశాలను ప్రస్తావించారు. వీటితోపాటు ప్రభుత్వ సిబ్బంది, ఉన్నతాధికారుల ఇళ్ల నిర్మాణం, ఎమ్మెల్యే క్వార్టర్స్‌, హైకోర్టు, ఇంటీరియమ్‌ గవర్నమెంటు కాంప్లెక్స్‌ (ఐజిసి) నిర్మాణం వంటి అంశాలను పొందుపరిచారు.
రెండోభాగంలో 2019 తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని ప్రస్తావించారు. తొలుత ప్రజావేదిక కూల్చివేత నుండి ప్రారంభించి మూడు రాజధానుల ప్రకటన, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. ముఖ్యంగా రూ.9000 కోట్ల వ్యయంతో చేపట్టిన అనేక పనులను నిలిపేసినందువల్ల కలిగిన నష్టాన్ని పేర్కొన్నారు. రాజధాని నిర్మించి ఉంటే ప్రభుత్వానికి వచ్చే ఉపయోగాలు, ఆర్థిక స్వావలంభన, అంతర్జాతీయ గుర్తింపు వంటి వాటిని ఒక అంశంగా చేర్చారు. రాజధాని మొత్తం అటవీ ప్రాంతంగా మారడం, వీటిమాటున అప్పటికే నిర్మించిన రోడ్లను తవ్వేసి వాటి కంకర, ఇసుక, ఇనుప సామాన్లు దొంగిలించడం, ప్రశ్నించిన వారిని వేధించడం వంటి అంశాలను చేర్చారు. 2019 నాటికి పూర్తయిన భవనాలు వినియోగించకోకపోవడం వల్ల ధ్వంసమైన తీరు, ఆర్థిక నష్టాలను వివరించారు. ముఖ్యంగా రాజధాని మాస్టర్‌ప్లానును ఇష్టారాజ్యంగా మార్చడం వల్ల ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించారు. ఇదే చాఫ్టర్లో రైతులు సుదీర్ఘంగా 1631 రోజులపాటు చేపట్టిన నిరసనల అంశాన్ని కూడా చేర్చినట్లు సమాచారం.
మూడోభాగంలో విశ్వనగరంగా అమరావతిని మార్చడం కోసం ఏమి చేయాలనే అంశాలను ప్రస్తావించారు. అప్పట్లో రూపొందించిన ప్లాను అమలుకు దాదాపు రూ.43 వేల కోట్లు ఖర్చవుతుందని, దీనికోసం నిధుల సమీకరణ, ప్రభుత్వ కార్యాలయాలు, సీడ్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ నిర్మాణం వంటి అంశాలను చేర్చారు. విదేశీ పెట్టుబడులను సమీకరించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకురావడం, రోడ్డు కనెక్టివిటీ చేపట్టడం, అమరావతికి బ్రాండింగ్‌ చేయడం తదితర అంశాలను కూడా ఈ భాగంలో చేర్చినట్లు తెలిసింది.

➡️