విశాఖ స్టీల్‌ జిందాల్‌ ఒప్పందం రద్దు – సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విశాఖ స్టీల్‌ప్లాంటులో ఆధునిక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ా3ని ప్రైవేటుకు అప్పగించేందుకు జిందాల్‌ స్టీల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిసిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 23 నెలల క్రితం కావాలని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ా3ని మూసివేసిందని తెలిపారు. ముడిసరుకు కొనడానికి నిధులు లేవనే పేరుతో స్టీల్‌ప్లాంటు ఉత్పత్తి తగ్గించి నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. ఇప్పుడు 3వ ఫర్నేస్‌ను నడిపేందుకు సెయిల్‌ను కాదని ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఇఒఐ) పేరుతో జిందాల్‌కు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుందని, దాన్ని రహస్యంగా ఉంచిందని తెలిపారు. దొడ్డిదారిన ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తోందని, విశాఖ ఉక్కును కక్షపూరితంగా అమ్మినా, మూసినా రాష్ట్ర ప్రజానీకం అంగీకరించదని హెచ్చరించారు. ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున సంఘీభావం ప్రకటించారు. జిందాల్‌ కంపెనీతో ఒప్పందమంటే ప్రైవేటు కంపెనీలను ఏదో విధంగా ప్లాంట్‌లోకి జప్పించాలని, గతంలో పోస్కో కంపెనీతో ఒప్పందం చేయాలని ప్రయత్నించి, నూరుశాతం అమ్మాలని నిర్ణయించి పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముక్కలు చేసి అమ్మే విధంగా జిందాల్‌ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసిందని పేర్కొన్నారు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కేంద్ర ప్రభుత్వ రంగ స్టీల్‌ పరిశ్రమని, భిలారు, బకారో, దుర్గాపూర్‌ పరిశ్రమలు ఇందులో ఉన్నాయని, దానితో ఒప్పందం ద్వారా సెయిల్‌కు దక్షిణ భారతదేశంలో స్టీల్‌ అమ్ముకోడానికి మార్కెట్‌ సౌకర్యం పెరుగుతుందని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటు నడపడానికి కావాల్సిన ముడిసరుకును పంపగలిగే శక్తి సెయిల్‌కు ఉందని వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, సెయిల్‌ రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలని, వీటి మధ్య ఒప్పందం జరిగితే రెండిటీకీ లాభం ఉంటుందని, దేశానికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రైవేటు కంపెనీని చేర్చడం ద్వారా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తారని, రిజర్వేషన్లు ఉండవని, ప్రైవేటు కంపెనీలు తమ లాభాల కోసం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి తప్పుడు చర్యని పేర్కొన్నారు. తీవ్రంగా నష్టాన్ని కలిగించే జిందాల్‌తో ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️