4న పాస్‌ పుస్తకాల ప్రతులు దగ్ధం : సిపిఐ

Jan 1,2024 10:58 #CPI, #Pass books
cpi protest on pass book

 

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూముల రీ సర్వే సందర్భంగా అవకతవకలతో తయారుచేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను జనవరి 4న గ్రామ సచివాలయాల వద్ద దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడ దాసరి భవన్‌లో ఎన్‌ రంగనాయుడు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలను సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వివరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు. జగనన్న భూరక్ష కింద పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మలను ముద్రించి రైతులకు అందజేస్తున్నారని, రైతులకు అందజేసిన పాస్‌ పుస్తకాలు భూమి రిజిస్ట్రేషన్‌కు, తనఖా పెట్టుకోవడానికి, రుణాలు పొందడానికి ఏమాత్రం ఉపయోగం లేదని తీర్మానం చేశారు. 3న అంగన్‌వాడీ కార్యకర్తల కలెక్టరేట్ల ముట్టడికి సిపిఐ మద్దతునివ్వాలని, అమరావతి రాజధాని రైతులకు జనవరి 5లోపు కౌలు చెల్లించాలని, 14, 15 ఆర్థిక సంఘం నిధులను వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని తీర్మానం చేశారు. బైజూస్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని, మున్సిపల్‌ కార్మికులు, సమగ్రశిక్షా అభియాన్‌, విఆర్‌ఒ, విఆర్‌ఎ, వలంటీర్ల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించింది. సమావేశంలో సిపిఐ నాయకులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు.

➡️