పూర్తి పరిహారం, పునరావాసం ఇవ్వండి

  • మెరుగైన వైద్యానికయ్యే ఖర్చు భరించండి
  • పోలవరం పునరావాస బాధితుని ఆత్మహత్యాయత్నంపై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పరిహారంతో పాటు తక్షణమే పునరావాసాన్ని ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పునరావాస బాధితుడు అత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షవైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. బాధిత రైతుకు తక్షణం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని, దానికయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ రైతు కుటుంబ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. మరిన్ని ఘటనలు జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులందరికి 100 శాతం పరిహారాన్ని, పునరావాసాన్ని ఇవ్వాలన్నారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిణామాలను వివరిస్తూ దేవీపట్నానికి చెందిన రైతు సీతారామయ్య రెండెకరాల భూమిని, ఇంటితోపాటు, తన మొత్తం ఆస్తిని ప్రాజెక్టుకోసం అర్పించారని తెలిపారు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నారని, 73 ఏళ్ల వయసులో ఇక తిరగలేక, విసిగి వేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. తన సర్వస్వాన్ని ప్రాజెక్టు కోసం ఇచ్చిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని గత టిడిపి ప్రభుత్వం, నేటి వైసిపి ప్రభుత్వం డంభాలు పలుకుతున్నాయని, అయితే, పునరావాస బాధితులకు 20 శాతం కూడా పరిహారం అందలేదని తెలిపారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పునరావాస ప్యాకేజీతో సహా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, కుంటి సాకులు చెబుతూ నిధులివ్వడానికి తాత్సారం చేస్తోందని, పునరావాస బాధ్యత నుండి తప్పుకుంటోందని తెలిపారు. పునరావాస బాధితుల ప్రాణాలతో, బతుకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మరిన్ని ఘటనలు జరగకముందే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పునరావాస బాధితులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతున్నట్లు తెలిపారు.

➡️