బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం

Feb 24,2024 09:01 #CPIM, #leftist leaders, #met, #ys sharmila

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ

కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం చేయాలని కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయించాయి. ఎపిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల ఆహ్వానం మేరకు సిపిఎం, సిపిఐ నాయకులు శుక్రవారం ఆంధ్రరత్న భవన్లో ఆమెతో సమావేశమైనారు. తొలుత సిపిఎం నాయకులతో చర్చించిన షర్మిల, అనంతరం సిపిఐ నాయకులతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆ పార్టీల నేతలు రాబోయే ఎన్నికల్లో పరస్పరం పోటీ నివారించుకోడానికి, సీట్ల సర్దుబాటుపైనా త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ చర్చల్లో కాంగ్రెస్‌ తరుపున షర్మిల, సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు, జెడి శీలం, సిపిఎం తరుపున రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ఉన్నారు. సిపిఐ తరుపున చర్చించిన వారిలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జెల్లి విల్సన్‌ ఉన్నారు. అనంతరం మూడు పార్టీల నాయకులు విలేకరులతో మాట్లాడారు.

వామపక్షాలతో కలిసి పోరాడతాం : షర్మిల

ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల సాధన, ఇతర రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలతో కలిసి పోరాడతామని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. రాష్ట్రం పదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేదని, దీనికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలే కారణమని తెలిపారు. చంద్రబాబుగానీ, జగన్‌గానీ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని విమర్శించారు. బిజెపి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చలేవని, పాలకులూ అడగడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే బిజెపి మెడలు వంచుతానన్న జగన్‌ ఈ ఐదేళ్లలో ఒక్కపోరాటం కూడా బిజెపికి వ్యతిరేకంగా చేయలేదని తెలిపారు. వైసిపి, టిడిపి రెండూ బిజెపికి బానిసలేనని తెలిపారు. అనంతపురంలో 26న, తరువాత విశాఖపట్నంలో భారీ బహిరంగసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆళ్ల రామకృష్ణ తనకు కావాల్సిన వ్యక్తని, ఆయనపై ఉన్న తీవ్ర ఒత్తిడివల్లే వెనక్కు వెళ్లాడని, ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

రెండు అంశాలపై ఏకాభిప్రాయం : వి. శ్రీనివాసరావు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని చెప్పారు. చర్చల్లో రెండు విషయాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఒకటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి, దానికి కొమ్ముకాస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వైసిపికి, టిడిపి జనసేన కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇండియా బ్లాకులో అనేక చిన్నచిన్న పార్టీలు ఉన్నాయని, అన్నిటితోనూ సహకరించుకుని ఎన్నికల్లో పరస్పరం పోటీపడకుండా దుష్టకూటములను ఓడించాలని నిర్ణయించామని తెలిపారు. వైసిపి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, యువత భవిష్యత్‌ను నాశనం చేశారని, డిఎస్‌సి ఇవ్వకుండా లక్షమందిని వీధులపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ప్రజలు చెత్తబుట్టలో పడేశారని, అటువంటి బిజెపితో కలవడం సిగ్గుచేటని, దీనిపై చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రజలను దగా చేస్తున్నారని, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏ ముఖ్యమంత్రి తిరగనన్ని సార్లు జగన్‌ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, రాజధానికి, పోలవరానికి నిధులు తేలేకపోయారని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు అమ్మకాన్ని ఆపలేకపోయారని చెప్పారు. రెండేళ్ల క్రితం కడప స్టీలుకు జిందాల్‌తో శంకుస్థాపన చేశారని, ఇప్పటి వరకూ పునాది రాయి కూడా వేయలేదని అన్నారు.. ఈ మూడుశక్తులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. దళితులు, మైనార్టీలు, మహిళలకు బిజెపి తీరని అన్యాయం చేస్తోందని, సామాజిక న్యాయానికి గోరీ కడుతున్నారని పేర్కొన్నారు.

బాబు, పవన్‌, జగన్‌ మోడీకి దాసోహం : రామకృష్ణ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బిజెపికి భయపడుతున్నాయని తెలిపారు. జగన్‌, బాబు, పవన్‌ మోడీకి దాసోహమంటున్నారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇతర ప్రజాతంత్ర పార్టీలను కలుపుకుంటామని, బిజెపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని పేర్కొన్నారు. దీనిపై ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు.

➡️