తెలంగాణా సాయుధ రైతాంగ ఉద్యమ చీఫ్‌ కొరియర్‌ చెన్నారెడ్డికి సిపిఎం నేతల పరామర్శ

Dec 28,2023 09:47 #cpm leader
cpm leaders visit chennareddy

 

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : తెలంగాణ రైతాంగ పోరాటంలో చీఫ్‌ కొరియర్‌గా పనిచేసిన ఎన్‌టిఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన దుగ్గి చెన్నారెడ్డి(97)ని సిపిఎం నాయకులు బుధవారం పరామర్శించారు. గత కొద్దిరోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సిపిఎం రాష్ట్ర నాయకులు బిఆర్‌.తులసీరావు, సీనియర్‌ నాయకులు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, గొల్లపల్లి వెంకటరత్నం, విజయరావు, మద్దిరెడ్డి మాధవరెడ్డి తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు. చెన్నారెడ్డి కుమారుడు దుగ్గి శ్రీనివాసరెడ్డిని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ తులసీరావు మాట్లాడుతూ.. 1949లో అజ్ఞాతంలోనే ఉండి పేదల తరుపున చెన్నారెడ్డి పోరాడారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ, ప్రజా వ్యతిరేక విధానాలపైనా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేశారని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో చీఫ్‌ కొరియర్‌గానూ పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా నాయకులు వి.నాగరాజు, రెడ్డిగూడెం సీనియర్‌ నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు మేకల జ్ఞానరత్నం, శ్రీరాంపురం శాఖ కార్యదర్శి ఇశ్రాయేలు, మోరంపూడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

➡️