పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు

  • కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సిఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పింఛన్ల పంపిణీపై సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి సంబంధించిన అంశంపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది కలెక్టర్లు.. సచివాలయ, ఇతర శాఖల ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయవచ్చని, వారం రోజుల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సిఎస్‌కు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని, పట్టణాలు, నగరాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశముందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన, ఈ నెల 3 నుంచి పింఛన్ల పంపిణీపై సవరించిన మార్గదర్శకాలను అత్యంత త్వరగా ఇస్తామని కలెక్టర్లకు చెప్పారు. కాగా, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులు, విద్యుత్‌ సరఫరాలపై సిఎస్‌ సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఈ నెల 8న నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో కృష్ణా డెల్టా పరిధిలోని మంచినీటి చెరువులు, సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులు నింపేందుకు ఈ నెల 4న ప్రకాశం బ్యారేజి నుంచి ఏలూరు, బందరు, రైవస్‌ కాలువలకు నీటిని విడుదల చేయనున్నామని వెల్లడించారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న ఈ నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించకుండా చూడటంతోపాటు, శివారు ప్రాంతాలకు సక్రమంగా అందేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఎండ వేడిమి, వడగాడ్పులు అధికమవుతోన్న క్రమంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10:30 లోపు పూర్తి చేసేలా చూడాలని, కూలీలు పనిచేసే ప్రదేశంలో తాగునీరు, మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 20 జిల్లాల్లో వేసవి ప్రణాళికను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు జైన్‌ మాట్లాడుతూ.. వడగాడ్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ప్రచురిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్‌లను అందుబాటులో ఉంచామని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు తెలిపారు. వేసవిలో ఎదురయ్యే విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ఈ సందర్భంగా సిఎస్‌కు తెలిపారు.

➡️