Cyclone Michaung : ఎపిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

అమరావతి : మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో … రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. 8 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. 5 జీఓల ద్వారా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం రూ.11 కోట్లు విడుదల చేసింది. ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా పరిహారం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం…

మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సిఎం వైయస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు.

5 జీఓలు, ఒక మెమో విడుదల చేసిన రెవెన్యూ శాఖ…

ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సిఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ నిధులు దేనికంటే…

ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది.

సహాయక చర్యలు ముమ్మరం….

తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మందిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల మందికి తుపాను హెచ్చరిక సందేశాలు (సెల్‌ ఫోన్‌కు) పంపినట్లు తెలిపారు.

కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలు…

కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్ల బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా నేతృత్వంలో శిబిరాల్లో తాగునీరు, ఆహారంతో పాటు వైద్య సహాయం కోసం వైద్య సిబ్బంది, మరుగుదొడ్లను, వైర్‌లెస్‌ సెట్లను ఏర్పాటు చేశారు. 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 20 వేల టన్నుల ధాన్యాన్ని గోడౌన్‌కు తరలించారు. ఇంకో 10 వేల టన్నుల ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

➡️