మనువాదుల పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం

Dec 2,2023 21:43 #aidwa, #D.Ramadevi
  • అన్నే అనసూయ వర్థంతి సభలో ఐద్వా నేత రమాదేవి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : దేశంలో మనువాదులు అధికారంలోకి రావడంతో లౌకిక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. ఐద్వా సీనియర్‌ నేత అన్నే అనసూయ వర్థంతి సందర్భంగా శనివారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో ‘రాజ్యాంగం మనువాదం మహిళలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తొలుత అన్నే అనసూయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా రమాదేవి హాజరై, మాట్లాడారు. మహిళలు, మైనార్టీలు, దళితులపై బిజెపి మతోన్మాద శక్తులు దాడులు చేస్తోందని విమర్శించారు. ప్రజలు తినే ఆహారం, మహిళలు వేసుకునే బట్టలపై ఆంక్షలు పెడుతోందన్నారు. దేశాన్ని వెనుకకు తీసుకెళ్లాలని బిజెపి తిరిగి చూస్తోందని విమర్శించారు. మనువాదంలో మహిళలు, దళితులు, గిరిజనులకు రక్షణ లేదని, మహిళను వంటింటికే పరిమితం చేయాలని చూస్తోందని తెలిపారు. అటువంటి మనువాదాన్ని తిరిగి సమాజంపై రుద్దాలని బిజెపి చూస్తోందని, ఇటువంటి సమయంలో ప్రజలంతా, ముఖ్యంగా మహిళలంతా బిజెపి విధానాలను తిప్పికొట్టాలని కోరారు. గుజరాత్‌ రాష్ట్రంలో బిల్కిన్‌ బావోలో నిండు గర్భిణిపై అత్యాచారం చేసిన ఘటనలో జైలుకు వెళ్లిన దుర్మార్గులను బిజెపి విడుదల చేయించిందని గుర్తు చేశారు. మహిళలు, ప్రజా సమస్యలపై అన్నే అనసూయ అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి తదితరులు మాట్లాడారు. ఐద్వా, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, అన్నే అనసూయ కుమార్తె అన్నే కల్పన, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️