సిఎఎపై వైఖరి ప్రకటించండి

Mar 13,2024 07:49 #CAA, #cpm protest, #Vijayawada

టిడిపి, వైసిపిలకు వామపక్షాల డిమాండ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై వైసిపి, టిడిపిలు తమ వైఖరిని ప్రకటిం చాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే ఈ ప్రక్రియను ప్రజలంతా ప్రతిఘటించాలని కోరాయి. మంగళవారం విజయవాడ లోని లెనిన్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సిఎఎ నోటిఫికేషన్‌ను నిరసిస్తూ సిపిఐ, సిపిఎంల ఆద్వర్యంలో నిరసన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకు సిఎఎ నోటిఫికేషన్‌ను ఇచ్చిందన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ ప్రమాదకరమైన సిఎఎ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించాయని తెలిపారు. దేశంలో ఈ పదేళ్ల కాలంలో పెరిగిన నిరుద్యోగం, పేదరికం, రైతాంగం సమస్యలు లాంటి వాటికి సమాధానం చెప్పుకోలేక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లుకొల్లగొట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం కుట్రలను చేస్తోందని విమర్శిం చారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ దేశంలో ప్రజలను మతాలపేరుతో చీలికలు తెచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సిఎఎ అనేది ముస్లిమ్‌ల సమస్య ఒక్కటే కాదని ఇది దేశ రాజ్యాంగ సమస్య అని అన్నారు. ఈ రోజు ముస్లిమ్‌లను లక్ష్యంగా పెట్టుకొన్న బిజెపి రేపు క్రైస్తవులు, దళితులు, గిరిజనులపై కూడా సిఎఎ పేరుతో దాడి చేసే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎఎ చట్టం చేసినపుడే దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ప్రజాందోళనలకు జడిసి నాడు వెనక్కు తగ్గిన బిజెపి ఇపుడు ఎన్నికల వస్తున్నాయని అమలుకు పూనుకుంటోందని చెప్పారుప ఈ ప్రమాదకరమైన సిఎఎపై రాష్ట్రంలోని టిడిపి, వైసిపి తమ వైఖరిలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి డి కాశిపతి, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

➡️