బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

– ఇండియా వేదిక అభ్యర్థుల ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) :అంబేద్కర్‌ రూపకల్పన చేసిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, రానున్న ఎన్నికల్లో బిజెపిని, దాని మిత్రులను ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఆదివారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియా వేదిక బలపరిచిన గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌, మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జన్నా శివశంకరరావు ప్రచార కార్యక్రమాన్ని రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. మంగళగిరి గౌతమ బుద్దారోడ్డు, మెయిన్‌ బజార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సెక్యులర్‌ పదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావు మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఎం నాయకులు జెవి రాఘవులు, ఎం బాలాజీ, వివి జవహర్‌లాల్‌, వై కమలాకర్‌, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, నాయకులు చిన్ని తిరుపతయ్య, జానుబాబు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కె జీవన్‌ సాగర్‌, కె రాధిక తదితరులు పాల్గొన్నారు.

➡️