మాది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు : డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : గత ప్రభుత్వం మాదిరిగా తమది కక్ష్య సాధింపుల ప్రభుత్వం కాదని డిప్యూటీ సిఎం కొణిదల పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సోమవారం పర్యటించారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు అయిపోయాయని, ఇప్పుడు పూర్తిగా పాలనపారమైన సవాళ్లను అధిగమించడంపై దృష్టి పెట్టానని తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నాసనం చేసిందన్నారు. ఈ శాఖ నిధులు ఏమయ్యాయో, ఎలా దారి మళ్లించారో కూడా అంతుపట్టడం లేదన్నారు. అప్పుల్లో మునిగిపోయిన శాఖ బాధ్యతలు చూస్తూ జీతం తీసుకోవడం భావ్యం కాదని, వేతనాన్ని వదులుకున్నానని తెలిపారు. హంగులు, ఆర్భాటాలు కాకుండా నాశనమైన వ్యవస్థలను తిరిగి సరిదిద్దాలనే సంకల్పంతోనే పని మొదలు పెట్టానని స్పష్టం చేశారు. తన వైపు నుంచి అవినీతికి తావుండదని, దీనికి తగినట్లుగా అధికారులు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఏ పరిశ్రమల నుంచి ఎంత మేర కాలుష్యం విడుదల అవుతుందనే లెక్కలు తీయుస్తున్నానని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.600 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండను తవ్వేసి రాజమహల్‌ కట్టారని విమర్శించారు. దీంతో ఓ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యేదని తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందన్నారు. ఫలితంగా గోదావరి పక్కనే ఉన్నా తాగునీరు అందని గ్రామాలు దర్శనమిస్తున్నాయన్నారు. కాకినాడలో బియ్యం మాఫియాను ప్రజలు కళ్లారా చూస్తున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై బాధ్యులకు శిక్ష పడాల్సిందేనని తెలిపారు.

➡️