ఆదర్శ కమ్యూనిస్టు ధూళిపాళ్ల

  • సంస్మరణ సభలో వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – కొల్లూరు (బాపట్ల జిల్లా) : కమ్యూనిజం ఎక్కడుందని, ఒకరు చంపితే చచ్చేది కాదని, ఉన్నవాడు.. లేనివాడు.. ఇలాంటి అసమానతలు ఉన్నంతకాలం వాటిని ప్రతిఘటించి, రూపుమాపేందుకు కమ్యూనిజం అవసరం ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గత నెల 28న మృతి చెందిన ధూళిపాళ్ల సుబ్బారావు సంస్మరణ సభ బాపట్ల జిల్లా కొల్లూరు మండలం, అనంతవరంలో శనివారం వారి స్వగృహంలో జరిగింది. సంస్మరణ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి హాజరయ్యాయరు. సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. సభకు ముందు కామ్రేడ్‌ సుబ్బారావు స్మారక స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ…కమ్యూనిస్టు సిద్ధాంతాలను సుబ్బారావు నమ్మి ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు. అమెరికా లాంటి దేశాలే సంక్షోభంలో పడిపోయాయని, ఆ దేశం అమలుపరుస్తోన్న విధానాల వల్లే అసమానతలు పెరగడమే ఇందుకు కారణమని వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. 20-30 సంవత్సరాల క్రితం వ్యవసాయ కార్మికుల పోరాటం అంటే పెద్ద యుద్ధం చేయడమేనని, రేపల్లెలో కూలి పోరాటం చేసేటప్పుడు ఎన్నో దాడులు జరిగాయని, తానూ స్వయానా అనుభవించానని, అలాంటి సమయంలో సుబ్బారావు లాంటివారు ఎందరో ఈ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కార్యక్రమానికి సిపిఎం కొల్లూరు మండల నాయకులు బొనిగల సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య, పార్టీ నాయకులు టి.కృష్ణమోహన్‌, వై.నేతాజీ, ములక శివసాంబిరెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️