ఉగాది ఉత్సవంలో విషాదం

Apr 11,2024 19:01 #current shok, #Kurnool
  • 17 మందికి కరెంటు షాక్‌
  •  పది మంది చిన్నారులకు గాయాలు

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉగాది ప్రభోత్సవ ఊరేగింపులో విద్యుత్‌ తీగలు తగిలి 17 మందికి గాయాలయ్యాయి. అందులో 10 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నటేకూరులో గ్రామ ప్రజలు గురువారం ఉదయం ప్రభోత్సవ ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపు జరుగుతుండగా వడ్డే మద్దిలేటి ఇంటి సమీపానికి ఉత్సవ ప్రభ రాగానే సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలి షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. ఎద్దుల బండిపై కూర్చున్న పది మంది చిన్నారులు, బండిని లాగుతున్న ఏడుగురు పెద్దలు కరెంటు షాక్‌కు గురయ్యారు. పెద్దలు వెంటనే తేరుకోగా చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయపడిన చిన్నారులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదమేమి లేదని వైద్యులు తెలిపారు. బాధిత చిన్నారులను నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరుచరితరెడ్డి కర్నూలు జనరల్‌ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు.

➡️