వైద్యులపై క్రమశిక్షణా చర్యలు

– ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరు పద్మావతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వ వైద్యులు ఐదేళ్లపాటు ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందించాల్సి ఉండగా, కొంతమంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరు పద్మావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్‌సర్వీస్‌ వైద్యులు పిజి కోర్సుల్లో చేరే సమయంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు ప్రభుత్వానికి సేవలందించాల్సి ఉందని వివరించారు. ఈ షరతులను అమలు చేయడంలో విఫలమైతే రూ.20 లక్షలతోపాటు ప్రభుత్వం చెల్లించిన జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందనా లేదని పేర్కొన్నారు. నోటీసులందుకున్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు జూన్‌ 15వ తేదీలోపు స్పందించకపోతే చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన వారి వివరాలను సఎవ.aజూ.అఱష.ఱఅ, షటష.aజూ.అఱష.ఱఅ, ష్ట్రఎటష.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్లలో పొందుపరిచామని వివరించారు.
ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపవర్‌ టెన్షన్‌కు చెక్‌ : ఎమ్‌టి కృష్ణబాబు
ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వారిలో హైపవర్‌ టెన్షన్‌ (రక్తపోటు) నివారణకు కృషి చేస్తామని వైద్యారోగ్య సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు ఆ శాఖ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు, ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగంతోపాటు క్రమం తప్పని శారీరక వ్యాయామాలు కొనసాగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అసాంక్రమిక వ్యాధులపై రూపొందించిన ఫ్లిప్‌చార్టులను అనంతరం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, డిఎంఇ నరసింహం, డిహెచ్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

➡️