అయోధ్య పేరుతో వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దు: సైబర్‌ పోలీసులు

Jan 20,2024 15:17 #syber crime

హైదరాబాద్‌: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామమందిరంపైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడున్న ఈ ట్రెండ్‌ ను సైబర్‌ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు తాజాగా సైబర్‌ నేరాలపై అలర్ట్‌ ప్రకటించారు. ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్‌ లింక్‌ లను, మెయిల్స్‌ ను ఓపెన్‌ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకల లైవ్‌ అంటూ, రామమందిర విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్‌ లు పంపుతూ సైబర్‌ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే లింక్‌ లను తెలియక ఓపెన్‌ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పేరుతోనూ సైబర్‌ నేరాలు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తుచేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్‌ చేసి, వారికి ఫోన్‌ చేసి మాయమాటలతో పలువురిని బురిడీ కొట్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

➡️