బెదిరింపులకు భయపడం -ఆందోళన ఉధృతం చేస్తాం

Dec 23,2023 09:01 #Anganwadi strike
  • అంగన్‌వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే
  • మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ?

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, వాటికి భయపడే ప్రసక్తే లేదని, ఆందోళనను ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ సంఘాలు హెచ్చరించాయి. శుక్రవారం నాడు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌.సుప్రజ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి వి.ఆర్‌.జ్యోతి, నాయకులు గంగావతి తదితరులు మాట్లాడారు. సమ్మె విరమించకపోతే ఉద్యోగాల్లో నుండి తీసేస్తామని జిల్లాల్లో అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని, అటువంటివాటికి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు మానుకుని, వర్కర్లు, మినీవర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచాలని డిమాండు చేశారు. గ్రాట్యుటీ అమలు చేయాలని, లేనిపక్షంలో 25 తరువాత సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా అంగన్‌వాడీ అక్క చెల్లెమ్మలకు తీపికబురు చెబుతారని ఆశించామని, స్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ చీరల కోసం రూ.16 కోట్లు వెచ్చించామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మొబైళ్లకు రూ.85 కోట్లు ఇచ్చామని చెప్పారని, అది సెంటర్ల నిర్వహణకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రకరకాల యాప్స్‌ తెచ్చి పనిభారం పెంచి బిపి, షుగర్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయక, సొంత ఫోన్లతోనే ఎక్కువమంది పనిచేస్తున్నారని తెలిపారు. అంతకుమించి అంగన్‌వాడీలకు చేసిందేమీ లేదని, పేద గర్భిణులు, బాలింతలకోసం సెంటర్లు నడపాలని చెప్పే ప్రభుత్వం వాటిని సరఫరా చేస్తున్న అంగన్‌వాడీలకు పౌష్టికాహారం అవసరం లేదా, అందుకు కనీస వేతనమైనా ఇవ్వరా అని ప్రశ్నించారు.

➡️