మొక్కుబడిగా కరువు బృందం పర్యటన

Dec 13,2023 08:49 #Drought team, #Makkubadiga, #paryatana

-పొద్దుపోయాక పొలాల్లోకి

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధికేంద్ర కరువు బృందం అనంతపురం జిల్లా పర్యటన మొక్కుబడిగా సాగింది. సాయంత్రం పొద్దుగూగాక పంట పొలాల పరిశీలన సాగింది. భారత వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్‌ యాదవ్‌ నేతృత్వంలో పది మంది సభ్యుల కేంద్ర బృందం మంగళవారం అనంతపురం జిల్లాకు వచ్చింది. 11.30 గంటలకు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఈ బృందం మధ్యాహ్నం 1.30 గంటల వరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైంది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. ఈ సమీక్షకు మీడియాకు అనుమతించలేదు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పంటల పరిశీలనకు మూడు బృందాలుగా బయలుదేరి వెళ్లింది. వీటిలో ఒక బృందం అనంతపురం రూరల్‌ మండలం కందుకూరులో, ఆత్మకూరు మండలం తలుపూరులో పర్యటించింది. వేరుశనగ, కంది రైతులతో మాట్లాడింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఈ బృందం దృష్టికి తీసుకొచ్చారు. మరో బృందం కల్యాణదుర్గంలోనూ, గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామంలోనూ పర్యటించింది. ఇక్కడ వేరుశనగ, కంది, ఆముదం పంటలను పరిశీలించింది. మూడవ బృందం గుత్తి మండలం వన్నేదొడ్డిలో వేరుశనగ, కంది పంటలను, పామిడి మండలంలో పత్తి పంటను పరిశీలించింది. కాగా, కేంద్ర బృందం బుధవారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనుంది. అడగడమే అత్తేసరు! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరువు వల్ల పంట నష్టం అంచనాలను రూపొందించింది. దీని ప్రకారం అనంతపురం జిల్లాలో జరిగిన పంట నష్టానికి రూ.251.20 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడొచ్చిన కరువు బృందం ముందు మాత్రం వ్యవసాయానికి సంబంధించి ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు ప్రతిపాదించినది రూ.158.63 కోట్లు మాత్రమే. మిర్చి పంటకు రూ.43.17 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. మొత్తంగా వ్యవసాయానికి సంబంధించి రూ.201.80 కోట్లకు ప్రతిపాదనలు చేశారు. పశుసంవర్థక శాఖకు రూ.1.74 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.7.04 కోట్లు, పట్టణ తాగునీటి సరఫరాకు రూ.2.72 కోట్లు, ఉపాధి హామీకి రూ.116.52 కోట్లు కలిపి మొత్తం రూ.329.82 కోట్లు ప్రతిపాదించారు. ఉపాధి హామీ వేతనాలకు రూ.69.90 కోట్లు, మేటీరియల్‌ కంపోనెంట్‌కు రూ.46.62 కోట్లు ప్రతిపాదించారు. రైతులను ఆదుకోవాలని సిపిఎం వినతిజిల్లాలో కరువు నెలకొన్న తరుణంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర కరువు బృందాన్ని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రాన్ని అందించారు. స్కేలు ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని కోరారు. రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు నష్టపరిహారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నగర కార్యదర్శి వి.రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

➡️