మద్యం మత్తులో సిగరెట్‌ను పక్కబోటులోకి విసిరేశారు : విశాఖ సిపి రవిశంకర్‌

Nov 25,2023 14:02 #boat, #cigarette, #CP, #Drunkenness, #Visakha

ఇద్దరు అరెస్టు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గత ఆదివారం అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్ లో జరిగింది కారకులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని విశాఖపట్నం మెట్రో పాలిటెన్ సిటీ పోలీస్ కమిషనర్ ఏ.రవిశంకర్ తెలిపారు. శనివారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో సంచలనం చేసిన ఫిషింగ్ హార్బర్ ప్రమాదం లో ప్రధాన నిందితులుగా వాసుపల్లి నాని, అతని మామయ్య అల్లిపిల్లి సత్యంలను గుర్తించామని తెలిపారు. సంఘటన జరిగిన రోజున ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆల్లిపిల్లి వెంకటేష్ కు చెందిన 887 బోటులో వీరు మద్యం సేవిస్తూ, సిగరెట్లు కాల్చారని, వాటిని ఆర్పకుండా పక్కనే ఉన్న మున్నెం హరి సీతారాంకు చెందిన 815 బోట్ లో విసిరేయడంతో ఆ బోటులో ఉన్న నైలాన్ వల కు నిప్పు అంటుకొని అక్కడ చిన్నగా పొగ మొదలైందని అదే సమయంలో ఆ ప్రాంతమంతా గాలులు రావడంతో మంటలుగా మారి ఉధృతం అయ్యాయని దానిని చూసిన వీరు భయపడి పారిపోయారని తెలిపారు. ఈ ప్రమాదం అనుకోని విధంగా జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో అనేక భద్రతా, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని గుర్తించామని వాటిని అధిగమించేందుకు పోర్ట్ అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కేసు విచారణను ఏసిపి మోసెస్ పాల్ కు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బృందాలు నగరంలోని 47 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని 20 మంది అనుమతులను విచారించడం జరిగిందని తెలిపారు.
సంఘటన జరిగిన అనంతరం ప్రసారమాధ్యమాల్లోనూ, స్థానికంగా అందిన ప్రాథమిక సమాచారం మేరకు విచారణలో భాగంగా అదే పేరుతో ఉన్న యూట్యూబర్ నాని నీ అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు సాంకేతిక ఆధారాలతో సరిచూసుకొని అతనిని నిరపరాధిగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు. దీనిపై అతని స్నేహితులు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కు తాము సమాధానం కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. జరిగిన సంఘటనలో మొత్తం 30 కోట్లు పూర్తిగా 18 బోట్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయని పూర్తిగా దెబ్బతిన్న బోట్ లకు 8.6 కోట్లు పాక్షికంగా దెబ్బతిన్న బోట్లకు 83.7 లక్షలు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ కేసు విచారణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వన్ టౌన్, హార్బర్, మల్కాపురం, న్యూ పోర్ట్ , పోలీస్ స్టేషనులకు చెందిన నాలుగు బృందాలను ఆయన అభినందించారు.

➡️