ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రం : దుర్గేష్‌

Jun 20,2024 23:00 #jansena, #minister Durgesh

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సహజసిద్ధమైన ప్రకృతి అందాలతో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రానికి పర్యాటకపరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. పర్యాటకం, కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, పర్యావరణహితమైన పర్యాటకాన్ని అభివృద్ధి పర్చాలనే ఆలోచన ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో రాబోయే ఐదేళ్లలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్దిదిద్దుతామని చెప్పారు. సినీరంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి రాష్ట్రం ఎంతో అనువుగా ఉందన్నారు. స్టూడియోల నిర్మాణానికి, మౌలిక వసతుల మెరుగు సినీ రంగ ప్రముఖులు, నిర్మాతలు రాష్ట్రానికి పెద్దయెత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌ ఎమ్‌డి కన్నబాబు, ఇడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

➡️