కూటమితో ఇసి కుమ్మక్కు : మంత్రి బొత్స

May 10,2024 22:22 #bosta satyanarayana, #press meet

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :యుపిఎ కూటమితో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే చేయూత, విద్యాదీవెన పథకాలకు సంబంధించిన నగదు, రైతులకు నష్టపరిహారం వంటి చెల్లింపులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే పింఛన్లు ఇంటింటికీ పంపిణీ చేయనీయకుండా అడ్డుకోవడం వల్ల గడిచిన రెండు నెలల్లో 38 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. విజయనగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల క్రితం మంజూరు చేసిన చేయూత డబ్బులు తాజాగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనీయకుండా ఇసి అడ్డుపడుతోందన్నారు. ఇదే విషయమై ఎన్నికల సంఘాన్ని అడిగితే ఫిర్యాదులు వచ్చాయి అందుకే అడ్డుకుంటున్నామని చెప్పడం ఎంత వరకు సమంజసమని, ఫిర్యాదులో గ్రావిటీ, నిజా, నిజాలు పరిశీలించాల్సి అవసరం లేదా అని ప్రశ్నించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, వృద్ధులను ఇబ్బందిపెడుతున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించబోడని అన్నారు. ఎన్నికలకు ముందే ప్రజలను ఇన్ని అగచాట్లు పెడుతున్న టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంకెన్ని ఇబ్బందులు పెడుతుందో? అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఉండాలని, అవి చంద్రబాబుకు పూర్తిగా లోపించాయని విమర్శించారు. తన కుటుంబంలోనే ఎక్కువ మందికి ఎమ్మెల్యే, ఎంపి సీట్లు ఇప్పించుకుంటున్న చంద్రబాబు ఆయన కోసం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకు కొత్తకాదని విమర్శించారు. జగన్‌ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అని, మాట తప్పిన వారు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది చంద్రబాబేనని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు హాని చేసే పనులు, ఫిర్యాదులు మానుకోవాలని హితవుపలికారు.

➡️