మంత్రి జోగి రమేష్‌కు ఇసి నోటీసు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పింఛన్ల పంపిణీకి సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌, వైసిపి జనరల్‌ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబును జోగి రమేష్‌ కించపరిచేలా మాట్లాడటమే కాకుండా, చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ ప్రచారం చేయాలంటూ వలంటీర్లకు జోగి రమేష్‌ చెబుతున్న వీడియోను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన జోగి రమేష్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేయాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసిపి సోషల్‌ మీడియాలో టిడిపి, చంద్రబాబుపై తప్పుడు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైనా వివరణ ఇవ్వాలని వైసిపి జనరల్‌ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

➡️