ఆలయ భూముల పరిరక్షణకు కృషి

  • దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఆలయాలను కాపాడటంతోపాటు వాటికి సంబంధించిన ప్రతి సెంటు భూమినీ పరిరక్షించేందుకు కృషి చేస్తామని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనరేట్‌లో గురువారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇస్తున్న మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణ, అనుమతులకు సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో ఫైల్‌పైనా సంతకాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 వేలకు పైగా ఆలయాలున్నాయని, వాటి ఆస్తులు, ఆదాయాలు నిర్వహణలో లోపాలను సరిదిద్ది ప్రక్షాళన చేయనున్నామన్నారు. పాలక వర్గాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, జులై 3 తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనరు ఎస్‌ సత్యనారాయణ, అడిషనల్‌ కమిషనరు-1 చంద్రకుమార్‌, అడిషనల్‌ కమిషనరు-2 కె.రామచంద్రమోహన్‌తో పాటు ఉన్నతాధికారులు రత్నరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఆర్‌జెసిలు సుబ్బారావు, మూర్తి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఇఒ కెఎస్‌ రామారావు, పలువురు ఇఒలు పాల్గొన్నారు.

➡️