నిజాయితీ, నిబద్ధతకు పట్టం కట్టండి

May 10,2024 21:35 #cpm pracharam

– దోపిడీదారులకు అవకాశం ఇవ్వొద్దు
– సిపిఎం అభ్యర్థుల ప్రచారం
ప్రజాశక్తి – యంత్రాంగం:సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ముగింపు ఘడియలు సమీపిస్తుండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్యకర్తలతో కలిసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారాలు, ప్రదర్శనలు, రోడ్‌ షోలు, బహిరంగ సభలు, మోటారు సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు. ప్రజల సొమ్మును దోచుకుతింటున్న దోపిడీదారులకు మరో అవకాశం ఇవ్వొద్దని కోరారు. నిజాయితీ, నిస్వార్థ నాయకులకు పట్టంకట్టాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో వివరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, సాలూరు మండలాల్లో అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణను గెలిపించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని గుమ్మలక్ష్మీపురంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, గరుగుబిల్లిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. మోడీ పదేళ్ల పాలనలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగడంతో దేశం ప్రమాదంలో పడిందని వివరించారు. మతాలు, ప్రాంతాలను విభజించి ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా బిజెపి ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నాశనం చేస్తోందని అన్నారు. 1/70 చట్టం, అటవీ హక్కులు చట్టం, పీసా చట్టం, ఉపాధి హామీ చట్టాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. జిఒ 3ను ఎత్తేయడంతో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి హక్కులు, చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నేపథ్యంలో అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. గరుగుబిల్లిలో కె.లోకనాధం మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీస్తూ.. గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపి పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గుమ్మలక్ష్మీపురంలో కోరన్న, మంగన్న స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ పాల్గన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు విస్తృత ప్రచారం చేశారు. నిమ్మగడ్డ రామ్మోహనరావునగర్‌, జగనన్న కాలనీ, వైఎస్‌ఆర్‌ కాలనీలలో ఓట్లను అభ్యర్థించారు. మంగళగిరి ప్రాంతంలో అనేక కాలనీల ఏర్పాటుకు కమ్యూనిస్టుల కృషే కారణమన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు దక్కాయని తెలిపారు. ప్రజలు తనను ఆదరించాలని కోరారు.

కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ పరిధిలోని అబ్బాస్‌ నగర్‌, శ్రీరామ్‌నగర్‌ ప్రాంతాల్లో పాణ్యం అభ్యర్థి డి గౌస్‌దేశారు ఇంటింటి ప్రచారం చేశారు. అయన ప్రచారానికి స్థానిక ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ఈ సందర్భంగా అనేక సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా గౌస్‌దేశారు మాట్లాడుతూ.. నియోజవర్గ అభివృద్ధికి తనను గెలిపించాలని కోరారు. చింతలముని నగర్‌, భగవాన్‌ నగర్‌, శివప్ప నగర్‌, ఎంఎస్‌ లక్ష్మి నగర్‌, ఈశ్వరప్ప నగర్‌లో గౌస్‌దేశారుకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు 53, 54 డివిజన్ల పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్థన్‌రెడ్డి కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, టిడ్కో ఇళ్లు కాలనీ, జగనన్న ఇళ్ల కాలనీ ప్రాంతాల్లో సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలపై అనేక రూపాల్లో పన్నుల భారాలు మోపుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాని కోరారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురం మండలం మొద్దులగూడెం, సీతంపేట, శ్రీరామగిరి, చొక్కనపల్లి, కల్తూనూరు, జీడిగుప్ప కొండదారి, జీడిగుప్ప కాలనీలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు రామారావుకు పూలమాలలు వేసి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ జికె.వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ వలస గెడ్డ, బూసుకొండ, శాండుకోరి గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోనూ జోరుగా ప్రచారం సాగింది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గంగవరం, జాలారిపల్లిపాలెం, పల్లిపాలెం ప్రాంతాల్లో ఆ నియోజకవర్గ అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం నిర్వహించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు తనను గెలిపించాలని కోరారు.

➡️