మాజీ మంత్రి దాడి వైసిపికి రాజీనామా.. రేపు టిడిపిలో చేరిక

ప్రజాశక్తి- అనకాపల్లి :మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు రత్నాకర్‌, జైవీర్‌… వైసిపికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరభద్రరావు మాట్లాడారు. రాజీనామా లేఖను వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి పంపినట్టు తెలిపారు. తాను 2019 ఎన్నికల ముందు వైసిపిలో చేరానని, అప్పట్లో తన కుమారుడు రత్నాకర్‌కు సీటు వస్తుందని భావించానని అన్నారు. గుడివాడ అమర్‌నాథ్‌కు సీటు రావడంతో తన కుటుంబం మొత్తం ఆయన విజయానికి కృషి చేసిందని వివరించారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లోనూ తమకు పార్టీ సీటిస్తుందన్న భరోసా లేకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్‌తో చర్చలు జరిపినట్టు తెలిపారు. బుధవారం వారి సమక్షంలో టిడిపిలో చేరుతానన్నారు.

➡️