పొత్తుపై తప్పుడు ప్రచారం : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

Jan 25,2024 08:21 #achennaidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన పొత్తుపై జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్‌ గోబెల్స్‌ను మించిపోయారని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీట్ల కేటాయింపులో నీచ రాజకీయానికి తెరలేపారని, దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వేసిపి నేతలు నకిలీ లేఖ విడుదల చేశారని, ఇందులో వాస్తవం లేదని వివరించారు. జగన్‌ ధన దాహానికి సహకార రంగం బలైందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రూ.వెయ్యి కోట్ల సొసైటీల సొమ్ము జగన్‌ ఖజానాకు చేరిందని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. నచ్చిన వారిని నామినేట్‌ చేసి జగన్‌ తన దోపిడీని కొనసాగిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా సహకార సంఘాల్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆసరా పేరుతో అసత్యాలు : కూన, చిరంజీవి

ఆసరా పేరుతో మహిళలకు జగన్‌ టోకరా వేస్తూ అసత్యాలు చెప్పారని టిడిపి నేతలు కూన రవికుమార్‌, వేపాడి చిరంజీవిరావు విమర్శించారు. కల్తీ మద్యం అమ్మిస్తూ.. మహిళల మాంగల్యాలు తెంపుతున్న ముఖ్యమంత్రి ఏ రకంగా మహిళలకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తికి రూ.2 కోట్ల విలువైన వాచ్‌ను ఇవ్వజూపిన వ్యవహారంలో టిటిడి ఇఒ ధర్మారెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

➡️