ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ

ప్రజాశక్తి-నెల్లూరు : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానని ఆయన తెలిపారు. నెల్లూరులో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. యథా నాయకుడు.. తథా అనుచరులు అన్నట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు బరితెగించి వ్యవహరిస్తున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ సలహాదారుల మాటలు విని సాక్షాత్తూ సీఎం జగన్ తన సొంత సోదరిని ఇష్టారీతిగా వేధిస్తున్నారని ఆరోపించారు. నాయకుడు చూపిన బాటలోనే అనుచరులు, కార్యకర్తలు నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం చేస్తూన్నారని తీవ్రంగా విమర్శించారు. ఉచ్చానీచాలు మరచి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ వ్యాఖ్యలపై మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లను తీసుకుని అసహ్యమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలంగాణ ఎన్నికల ముందు అక్కడి నాయకులు ఎన్ని యూట్యూబ్ చానళ్లను కొనుగోలు చేసినా ఫలితాలపై ప్రభావం చూపించలేకపోయారనే విషయం మరిచిపోవద్దని అధికార పార్టీకి కోటంరెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఆరోపణలను కోటంరెడ్డి ఖండించారు. చెల్లెలు వరుసయ్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ అసహ్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల క్రితం ఆది దంపతులు అన్న నోటితోనే ఇప్పుడు తిట్లదండకం చదువుతున్నారని విమర్శించారు.   మరోసారి వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ధీటుగా సమాధానం చెబుతానంటూ ప్రసన్న కుమార్ రెడ్డిని కోటంరెడ్డి హెచ్చరించారు. నిజంగా లక్షల మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం విజయసాయి రెడ్డికి ఉంటే తన నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు.

➡️